కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో నేడు(మంగళవారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట మరోసారి హాజరయ్యారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా వెంట ఆమె కుమారై ప్రియాంక గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ వచ్చారు. ఈడీ ఆఫీసు వద్ద తల్లి, సోదరిని దింపిన అనంతరం రాహుల్‌గాంధీ పార్లమెంట్‌కు వెళ్లారు. సోనియా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహయంగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె విచారణ గదిలో కాకుండా మరో గదిలో ఉండాలని సూచించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న సోనియాను ఈడీ మూడు గంటల పాటు విచారించింది. 20కు పైగా ప్రశ్నలను అడిగింది. అనంతరం ఈ నెల 26న మరోమారు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. ఈ క్రమంలో సోనియా నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరుకావడంతో ఆమె ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
సోనియా ఈడీ విచారణ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్‌కు అనుమతి ఇవ్వలేదు. కాగా.. ఇదే కేసులో రాహుల్ గాంధీని ఈడీ 5 రోజులు విచారించిన సంగతి తెలిసిందే.