చురుకైన చిరుత 'పవన్' మృతి.. కాలువలో మృతదేహం
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ నుండి ఒక చేదు వార్త అందింది.
By Medi Samrat
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ నుండి ఒక చేదు వార్త అందింది. మంగళవారం మగ చిరుత పవన్ డ్రెయిన్ దగ్గర శవమై కనిపించింది. మిగిలిన చిరుతలు ఎన్‌క్లోజర్‌లలో ఉండగా.. పవన్ ఒక్కడే అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
ఏపీసీసీఎఫ్ అండ్ డైరెక్టర్ ఉత్తమ్ కుమార్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో పవన్ డ్రెయిన్ ఒడ్డున శవమై కనిపించాడు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా డ్రెయిన్ ఉప్పొంగి.. పవన్ తల నీటిలో మునిగిపోయింది. బయటి నుంచి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మరణానికి ప్రాథమిక కారణం నీట మునిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు, పోస్ట్ మార్టం నివేదిక తర్వాతే తుది నిర్ధారణ అందుబాటులోకి రానుంది.
సెప్టెంబర్ 17, 2022న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలను కునో నేషనల్ పార్క్‌లో వదిలేశారు. దీని తరువాత 18 ఫిబ్రవరి 2023న దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతపులులను తీసుకువచ్చారు. మొత్తం 20 చిరుత పులుల్లో ఇప్పటి వరకు ఎనిమిది చిరుతలు వ్యాధి, ప్రమాదాల కారణంగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. పవన్ మునుపటి పేరు ఒబాన్. పవన్ నమీబియా అడవులలొ పుట్టింది. దీనికి అద్భుతమైన వేటగాడిగా పేరుంది.