నాగ్‌పూర్ హింసాకాండ ప్ర‌ధాన‌ సూత్రధారి అరెస్ట్‌.. గ‌త ఎన్నిక‌ల్లో గడ్కరీపై కూడా పోటీ చేశాడు..!

సోమవారం నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసాకాండకు సూత్రధారి అయిన‌ ఫహీమ్ షమీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on  19 March 2025 3:42 PM IST
నాగ్‌పూర్ హింసాకాండ ప్ర‌ధాన‌ సూత్రధారి అరెస్ట్‌.. గ‌త ఎన్నిక‌ల్లో గడ్కరీపై కూడా పోటీ చేశాడు..!

సోమవారం నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసాకాండకు సూత్రధారి అయిన‌ ఫహీమ్ షమీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షమీమ్ ఖాన్ ప్రజలను హింసకు ప్రేరేపించారని ఆరోపణ‌లు వ‌చ్చాయి. కోర్టు అతడిని మార్చి 21 వరకు కస్టడీకి పంపింది. ఫహీమ్ ఖాన్ సహా 51 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హింస చెల‌రేగ‌డానికి ప్రధాన నిందితుడు 38 ఏళ్ల ఫహీమ్ షమీమ్ ఖాన్ కారణమని పోలీసులు పేర్కొన్నారు. అతడు మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ (MNDP) నాగ్‌పూర్ అధ్యక్షుడు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీపై ఫహీమ్‌ఖాన్‌ పోటీ చేశారు. అతను నాగ్‌పూర్‌లోని యశోధర నగర్‌లోని సంజయ్ బాగ్ కాలనీ నివాసి. 2024లో జరిగిన ఎన్నికల్లో నితిన్ గడ్కరీ చేతిలో 6.5 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయనకు 1,073 ఓట్లు వచ్చాయి.

మహారాష్ట్ర నుంచి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ వంటి హిందూ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు ప్రతిస్పందనగా సోమవారం నాగ్‌పూర్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిని గుర్తిస్తున్నారు.

నాగ్‌పూర్‌లో ఒకరోజు ముందు జరిగిన హింస ముందస్తు ప్రణాళికతో జరిగినదని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. హింసకు పాల్పడిన వారిపై పరిపాలన కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ విదర్భ రాష్ట్ర మంత్రి దేవేష్ మిశ్రా మీడియాతో అన్నారు. సంబంధిత మసీదు ధర్మకర్తలు, మతపెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నాగ్‌పూర్‌లో విహెచ్‌పి, భజరంగ్ దళ్ నేతృత్వంలో జరిగిన నిరసనల సందర్భంగా మతపరమైన గీతలతో కూడిన షీట్‌లను కాల్చివేశారని, ఇది హింసకు దారితీసిందనే వాదనలను దేవేష్ మిశ్రా తిరస్కరించారు. విహెచ్‌పి ఆధ్వర్యంలో మహారాష్ట్ర అంతటా శాంతియుతంగా ఉద్యమం చేపట్టామన్నారు. కానీ, నాగ్‌పూర్‌లోని ఔరంగజేబు అభిమానులు కొందరు హింసను ప్రేరేపించడానికి పుకార్లు వ్యాప్తి చేశారన్నారు.

Next Story