అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల విషయంలో బయటపడ్డ మరో యాంగిల్
Mumbai Police On Jaish-Ul-Hind Link To Mukesh Ambani Security Scare. ఫిబ్రవరి 25న ముఖేశ్ అంబానీ ఆసియా కుబేరుడు అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల విషయంలో బయటపడ్డ మరో యాంగిల్
By Medi Samrat Published on 1 March 2021 9:06 AM GMTఫిబ్రవరి 25న ముఖేశ్ అంబానీ ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాలతో ఒక వాహనం నిలిపి ఉంచడం కలకలం రేపింది. ఇది ట్రైలర్ మాత్రమే..అని హెచ్చరించడంతోపాటు బిట్‌కాయిన్ ద్వారా డబ్బు డిమాండ్ చేసినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. జైష్-ఉల్-హింద్ సవాల్ విసిరిందన్న వార్త మరింత ఆందోళన రేపింది. దీంతో ముంబై పోలీసులు అంబానీ ఇంటిముందు భారీ భద్రతను విధించారు. ఈ కేసును 10 పోలీసు బృందాలు, ఎన్‌ఐఏ సంయుక్తంగా విచారిస్తున్నాయి.
అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచింది తామేనని 'జైష్ ఉల్ హింద్' సంస్థ ప్రకటించిందన్నవార్త ఫేక్ న్యూస్ అంటూ జైష్-ఉల్-హింద్ చేసిన తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. టెలిగ్రామ్ యాప్‌లో మెసేజ్ ద్వారా తామే దీనికి బాధ్యత వహిస్తున్నట్లు వచ్చిన నివేదికలను ఖండింస్తూ జైష్-ఉల్-హింద్ ఒక ప్రకటన విడుదల చేసిందని బిజినెస్ టుడే తెలిపింది. టెలిగ్రామ్ ఖాతాలో, జైష్-ఉల్-హింద్ పేరిట విడుదల చేసిన పోస్టర్‌తో తమకు సంబంధంలేదని, తప్పుడు వార్తలని పేర్కొంది. జైష్-ఉల్-హింద్ నుండి అంబానీకి ముప్పు లేదు అనే పేరుతో వెల్లడించారు.
జైష్ ఉల్ హింద్ తమ పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ ఫాసిజానికి వ్యతిరేకంగా మాత్రమేనని.. హిందూ అమాయక ముస్లింలకు వ్యతిరేకంగా కాదని జైష్ ఉల్ హింద్ తెలిపినట్లు నేషనల్ మీడియా చెబుతోంది. మా పోరాటం షరియా కోసం.. డబ్బు కోసం కాదని.. లౌకిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం గానీ అంబానీకి వ్యతిరేకంగా కాదని జైష్ ఉల్ హింద్ తెలిపింది. తాము అవిశ్వాసులనుంచి డబ్బులు తీసుకోమని, భారతీయ వ్యాపార దిగ్గజాలతో తమకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. మార్ఫింగ్ ఫోటోలతో భారత నిఘా సంస్థ నకిలీ పోస్టర్లు తయారు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జైష్ ఉల్ హింద్ కు ఈ బెదిరింపులతో ఎటువంటి సంబంధం లేకపోవడంతో దీని వెనుక ఎవరు ఉన్నారా అని మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి.