నవనీత్ రాణా దంపతుల బెయిల్ రద్దు చేయాలంటూ ముంబై పోలీసుల పిటీషన్
Mumbai police files plea seeking cancellation of Rana couple's bail. హనుమాన్ చాలీసా పారాయణంపై వివాదం నేపథ్యంలో దేశద్రోహం కేసులో నిందితులైన
By Medi Samrat Published on 9 May 2022 4:39 PM IST
హనుమాన్ చాలీసా పారాయణంపై వివాదం నేపథ్యంలో దేశద్రోహం కేసులో నిందితులైన స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ముంబై పోలీసులు సోమవారం నాడు ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
గతవారం బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక కోర్టు విధించిన షరతుల్లో ఒక దానిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దంపతుల బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోరారు. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ సభ్యురాలు నవనీత్ రాణా, ఆమె భర్త అమరావతిలోని బద్నేరా శాసనసభ్యుడు రవి రాణాను ఏప్రిల్ 23న ముంబై పోలీసులు అరెస్టు చేశారు, వారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం 'మాతోశ్రీ' వెలుపల హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తారని ప్రకటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత, హై డ్రామా నెలకొంది.
వారిపై దేశద్రోహం, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక న్యాయస్థానం మే 4న దంపతులకు బెయిల్ మంజూరు చేసి, ఇలాంటి నేరానికి పాల్పడకూడదని, మీడియాతో మాట్లాడకూడదని సహా కొన్ని షరతులు విధించింది. సోమవారం నాడు సబర్బన్ ఖార్ పోలీసులు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరత్ ద్వారా వారి బెయిల్ రద్దు చేయాలని దరఖాస్తు చేశారు. మీడియాతో మాట్లాడకూడదనే షరతును ఉల్లంఘించినందున ఈ జంట బెయిల్‌ను కోర్టు రద్దు చేయాలని కోరింది.
"నిందితులు (నవనీత్ రాణా మరియు రవి రాణా) విడుదలైనప్పటి నుండి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వారికి బెయిల్ మంజూరు చేసేటప్పుడు ప్రత్యేక కోర్టు విధించిన షరతును ఉల్లంఘించారు. బెయిల్‌ను రద్దు చేయాలని, నిందితులకు వారెంట్ జారీ చేయాలని.. వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని మేము కోరుతున్నాము, "అని ఘరత్ కోర్టుకు చెప్పారు.