భారత్ లో ఈ నెల 16న నిర్వహించాలని భావించిన జాతీయ సినిమా దినోత్సవం వాయిదా పడింది. దీనిని సెప్టెంబరు 23కి వాయిదా వేసినట్టు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) వెల్లడించింది. జాతీయ సినిమా దినోత్సవం నాడు దేశంలోని 4 వేలకు పైగా మల్టీప్లెక్స్ లలో రూ.75కే ప్రత్యేక ప్రవేశ టికెట్ అందజేయాలని ఎంఏఐ నిర్ణయించింది. పీవీఆర్, ఐనాక్స్, సినీపొలిస్, కార్నివాల్, డిలైట్ తదితర మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సినిమా దినోత్సవంలో భాగమయ్యాయి. ఈ వేడుకల్లో మరిన్ని మల్టీప్లెక్స్ లను కలుపుకుని పోయేందుకు గాను జాతీయ సినిమా దినోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎంఏఐ తెలిపింది.
జాతీయ సినిమా దినోత్సవం నాడు మల్టీప్లెక్స్ లకు, థియేటర్లకు భారీగా తరలిరావాలని ఎంఏఐ ప్రేక్షకులను ఆహ్వానించింది. కరోనా సంక్షోభం అనంతరం మల్టీప్లెక్స్ లను, థియేటర్లను మళ్లీ తెరిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ జాతీయ సినిమా దినోత్సవం నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో.. అమెరికాలో సెప్టెంబర్ 3న జాతీయ సినిమా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సినీ ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదించడానికి $3 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. AMC, రీగల్ సినిమాలతో సహా 3,000 కంటే ఎక్కువ థియేటర్లలో 30,000 కంటే ఎక్కువ స్క్రీన్‌లపై దేశవ్యాప్తంగా ఒకరోజు భారీగా సినిమాలను ప్రదర్శించారు.