ఆందోళనకరంగా ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి
Mulayam Singh Yadav in critical care unit. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
By Medi Samrat Published on 3 Oct 2022 4:34 PM ISTఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆయన్ను హుటాహుటినా గుర్‌గ్రామ్ మేదాంత ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మేదాంత ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో ఉన్నారని.. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయనకు చికిత్స అందిస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించారు. సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ లో ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యంపై మేదాంత హాస్పిటల్ విడుదల చేసిన ప్రకటన కాపీని షేర్ చేసింది.
ములాయం కొద్దిరోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ముందు ఐసీయూ.. ఆ తర్వాత సీసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 82 ఏళ్ల SP అధినేత ప్రస్తుతం లోక్‌సభలో మెయిన్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేతాజీ గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లోని 'క్రిటికల్ కేర్ యూనిట్'లో చికిత్స పొందుతున్నారని సమాజ్ వాదీ పార్టీ తెలిపింది. పరిస్థితి నిలకడగా ఉందని.. దయచేసి ఆయన్ను కలిసేందుకు ఆసుపత్రికి రావద్దంటూ కోరింది. ములాయం తనయుడు, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ములాయం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడి తన తండ్రి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా ఆరా తీసారు. ములాయం సింగ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడారు. ములాయం సింగ్ యాదవ్ కు ఉత్తమ చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి నిలకడగా ఉందని సమాజ్ వాదీ పార్టీ ఆదివారం రాత్రి తెలియజేసింది. అయితే ఈరోజు ఉదయం నుండి ఆయన ఆరోగ్యం క్షీణించింది.