గురువారం రాత్రి గుండెపోటుతో మరణించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన 60 ఏళ్ల గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గట్టి భద్రత మధ్య ఈ రోజు ఉదయం 10:45 గంటలకు అతని స్వస్థలమైన ఘాజీపూర్‌లో ఖననం చేశారు. గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ అంతిమయాత్రలో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అతని మద్దతుదారులు కొందరు శ్మశాన వాటికలోకి ప్రవేశించడానికి బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులతో కొద్దిసేపు ఘర్షణకు దిగారు.
ముఖ్తార్ అన్సారీని ఘాజీపూర్‌లో ఖననం చేశారు. శ్మశాన వాటిక వద్ద వేలాది మంది ప్రజలు గుమిగూడారు. అతని కుమారుడు ఉమర్ అన్సారీ, ఇతర కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బందాలోని ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం అతని మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున ఘాజీపూర్‌కు తీసుకువచ్చారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన 'మౌ' ప్రాంతం సహా ఘాజీపూర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. జైలులో అన్సారీకి స్లో పాయిజన్ ఇచ్చారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో బందాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆయన మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు సభ్యుల బృందం మెజిస్టీరియల్ విచారణ చేపట్టనుంది.