న‌వ‌నీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్‌.. ఎంపీ ప‌ద‌వికి గండం..!

MP Navneet Kaur fined Rs 2 lakh for "Fake" caste papers. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల‌లో నటించి.. ఆపై ఎమ్మెల్యేను వివాహ‌మాడి.. త‌ద‌నంత‌రం

By Medi Samrat  Published on  8 Jun 2021 9:37 AM GMT
న‌వ‌నీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్‌.. ఎంపీ ప‌ద‌వికి గండం..!
టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల‌లో నటించి.. ఆపై ఎమ్మెల్యేను వివాహ‌మాడి.. త‌ద‌నంత‌రం రాజ‌కీయ ఎంట్రీ ఇచ్చిన‌ అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివ‌రాళ్లోకెళితే.. శివసేన నేత, మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్.. ఎంపీ నవనీత్ కౌర్ ఎస్పీ కాదని, ఫోర్జరీ సర్టిఫికెట్‌తో పోటీచేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన‌ బాంబే హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది.


నవనీత్ కౌర్‌ ఎస్సీ కేటగిరికి చెందిన మహిళ కాదని.. కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేసింది. దీంతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు నవనీత్ కౌర్ ఆరు నెలల్లోగా తన సర్టిఫికెట్లు కోర్టు ముందుంచాలని ఆదేశించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ విజయం సాధించారు. బాంబే హైకోర్టు తీర్పుతో ఆమె పార్లమెంట్ సభ్యత్వానికి ముప్పు ఏర్పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్.. ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. నవనీత్ కౌర్‌ భర్త రవి రాణా ప్రస్తుతం అమరావతి జిల్లా బద్నేరా ఎమ్మెల్యేగా ఉన్నారు.


Next Story