కేరళలోని మలప్పురానికి చెందిన తల్లీ కొడుకులిద్దరూ ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 42 ఏళ్ల బిందు, ఆమె 24 ఏళ్ల కుమారుడు వివేక్ ఈ అరుదైన ఫీట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. బిందు లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC) పరీక్షలో 38 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించగా.. ఆమె కుమారుడు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ (LGS) పరీక్షలో 92 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించాడు.
బిందు మూడు సార్లు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్, రెండు సార్లు లోయర్ డివిజనల్ క్లర్క్ పరీక్షలు రాసి విఫలమైంది. ఎట్టకేలకు ఆమె నాలుగో ప్రయత్నంలో ఎల్‌డీసీ పరీక్షలో విజయం సాధించింది. దశాబ్దకాలంగా అంగన్‌వాడీ కేంద్రంలో బోధిస్తున్న బిందు.. ఈ విజయం పట్ల మాట్లాడుతూ.. తన కుటుంబం, కోచింగ్ సెంటర్‌లోని బోధకులు నిరంతరం ప్రేరణగా, మద్దతుగా నిలిచారని చెప్పారు.
తన తల్లితో కలిసి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం పట్ల వివేక్ ఆనందం వ్యక్తం చేశారు. "మేమిద్దరం కలిసి కోచింగ్ క్లాస్‌లకు వెళ్ళాము. మా అమ్మ నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. మా నాన్న మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసారు. మా ఉపాధ్యాయుల నుండి మాకు చాలా ప్రేరణ వచ్చింది. మేమిద్దరం కలిసి చదువుకున్నాము, కానీ మేము కలిసి అర్హత సాధిస్తామని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం'' అని వివేక్ చెప్పారు.