Mosquito Coil : ఊహించని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
Mosquito Coil Sets Off Fire In Delhi House. తూర్పు ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఆరుగురు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 31 March 2023 2:28 PM ISTMosquito Coil Sets Off Fire In Delhi House, 6 Killed
తూర్పు ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఆరుగురు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు రాత్రి మస్కిటో కాయిల్ ను అంటించి పరుపుపై పడుకున్నారు. మస్కిటో కాయిల్ పడి పరుపుకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే ఊపిరాడక చనిపోయివుంటారని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రూమ్‌లో నిద్రిస్తున్న ఎనిమిది మందిలో.. ఆరుగురు మరణించారు. చనిపోయిన వారిలో ఏడాదిన్నర పాప, ఒక మహిళ కూడా ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జీటీబీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్నవారిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరిలో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మస్కిటో కాయిల్ నుంచి పరుపుకు మంటలు అంటుకుని తద్వారా ఇంటికి మంటలు అంటుకున్నాయని పొరుగున ఉండే షఫీక్ అహ్మద్ అనే వ్యక్తి చెబుతున్నాడు. ఇల్లు మొత్తం ఐదు అంతస్తులు కాగా.. ఇందులో దాదాపు 20 గదులు ఉన్నాయి. మొత్తం 50 మందికి పైగా అక్కడ నివాసముంటారు. ఇంటి యజమాని కుటుంబానికి చెందిన 35 మంది ఇంట్లో ఉన్నారు. మిగతా వారంతా ఇక్కడ అద్దెదారులుగా జీవిస్తున్నారు.
జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ ప్రమాద ఘటనను ధృవీకరించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు.. ఒక ఇంట్లో ఎనిమిది మంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది, అందరినీ జగ్ ప్రవేశ్ చంద్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఏడుగురు చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించారు. కాలిన గాయాలు, ఊపిరాడక ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.