కమలంపై ఎంత బురదజల్లితే అంత వికసిస్తుంది: ప్రధాని మోదీ
More you throw mud at BJP, the more lotus will bloom.. PM Modi to Oppn. న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గురువారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ
By అంజి Published on 9 Feb 2023 2:13 PM GMTన్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గురువారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని, వారు చేస్తున్న విమర్శలకు ఘాటుగా జవాబిచ్చారు. బీజేపీని ఎంత టార్గెట్ చేస్తే అంత బాగా కమలం వికసిస్తుందని అన్నారు. "నేను ఈ ఎంపీలకు (ప్రతిపక్ష ఎంపీలకు) చెప్పాలనుకుంటున్నాను.. మీరు ఎంత ఎక్కువ ' కీచడ్ (బురద)' వేస్తే, కమలం అంత బాగా వికసిస్తుంది" అని ప్రధాని మోదీ అన్నారు. గత మూడు, నాలుగేళ్లలో 11 కోట్ల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు లభించాయని, తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా 48 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి చర్యల గురించి వివరించారు.
ప్రధాని మాట్లాడుతున్న సమయంలోనే ప్రతిపక్ష ఎంపీలు అదానీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ కేసులో జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలన్న డిమాండ్‌పై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బుధవారం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ''అదానీ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరగాలి... ప్రభుత్వం దేనికీ భయపడనప్పుడు జేపీసీని ఏర్పాటు చేయాలి'' అని ఖర్గే అన్నారు. బుధవారం నాడు అదానీ సమస్యపై ప్రధాని, ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడికి దిగిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా అన్నారు. ''నేను చాలా తరచుగా కలబురగికి వస్తానని ఖర్గేజీ ఫిర్యాదు చేస్తున్నాడు. అక్కడ జరిగే పనిని ఆయన చూడాలి. కలబురగిలో 8 లక్షలకు పైగా కర్ణాటకలో 1.70 కోట్ల జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి'' అని అన్నారు.
కాంగ్రెస్‌ను మరింత లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ''నేను 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు భారతదేశం సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదిని సృష్టించాలనుకున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రతిచోటా సమస్యలను సృష్టించిందని నేను చూశాను'' అని అన్నారు. పేదరికంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. కాంగ్రెస్ వారు 'గరీబీ హఠావో' అని చెప్పేవారు కానీ 4 దశాబ్దాలుగా ఏమీ చేయలేదన్నారు. వారికి వ్యతిరేకంగా, దేశ ప్రజల అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా తాము కృషి చేశామన్నారు. తమ ప్రాధాన్యత సామాన్య ప్రజానీకం, అందుకే దేశంలోని 25 కోట్ల కుటుంబాలకు ఎల్‌పిజి కనెక్షన్‌లను అందుబాటులోకి తెచ్చామన్నారు.