సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
Monsoon session to begin from July 18. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి.
By Medi Samrat
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆల్‌పార్టీ మీటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల సన్నాహాలపై నేతలకు వివరించారు. కాంగ్రెస్ నేత అధిర్‌రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్, వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఆర్‌ఎల్‌జేపీ ఎంపీ పశుపతి కుమార్ పరాస్‌తో పాటు పలు పార్టీల ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశాలకు సంబంధించి అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమైన అంశాలపై చర్చించాలని అన్ని పార్టీల నేతలను కోరానన్నారు. సభ గౌరవ ప్రదంగా నడిచేలా.. సభా కార్యక్రమాలకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఇక పార్లమెంటులో ఉపయోగించ కూడని పదాలు (అన్ పార్లమెంటరీ వర్డ్స్) గురించి నోటిఫికేషన్ జారీ చేసిన లోక్ సభ సెక్రటేరియట్ మరిన్నింటిపై ఆంక్షలను తీసుకువచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ఎవరూ కూడా ప్లకార్డులను లోక్ సభలో ప్రదర్శించకూడదని మార్గదర్శకాల్లో ఉంది. ఎటువంటి సాహిత్యం కానీ, ప్రశ్నలు, కరపత్రాలు, ప్రెస్ నోట్లు, ఇతర రూపాల్లోని సమాచారాన్ని కానీ స్పీకర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రదర్శించడాన్ని నిషేధించారు.