'హారన్ మోగించకండి.. ప్రధాని మోదీ రెస్ట్‌ తీసుకుంటున్నారు'.. అసదుద్దీన్ ఒవైసీ సెటైర్‌

'Modiji is resting, please don’t honk..’.. Owaisi takes dig at PM on China. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత భూభాగంలోకి చైనా చొరబాటు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ

By అంజి  Published on  17 Dec 2022 7:53 AM GMT
హారన్ మోగించకండి.. ప్రధాని మోదీ రెస్ట్‌ తీసుకుంటున్నారు.. అసదుద్దీన్ ఒవైసీ సెటైర్‌

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత భూభాగంలోకి చైనా చొరబాటు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడకపోవడంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం మండిపడ్డారు. ''దయచేసి లోక్ కళ్యాణ్ మార్గ్ దగ్గర మీ హారన్ మోగించకండి. మోదీజీ విశ్రాంతి తీసుకుంటున్నారని, చైనా అనే పదాన్ని ఉచ్చరించే ధైర్యం చేయలేకపోతున్నారు''అని ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్‌ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా భారత భూభాగంలోకి చైనా చొరబాటు అంశంపై కేంద్రం స్పందనపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌పై ఆధిపత్యం సాధించడం కోసం చైనా ఎప్పటి నుంచో కుట్ర చేస్తోంది. ఆ ప్రాంతాన్ని తమ భూభాగంలో కలుపుకోవాలని పన్నాగాలు పన్నుతున్న చైనా...ఈ సారి అక్కడి కీలక ప్రదేశమైన తవాంగ్‌లోనే ఘర్షణకు దిగింది. డిసెంబరు 9న అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దేశానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీకి చెందిన సైనికులు, భారతీయ సైనికులతో బాహాబాహీకి దిగారు. ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా భారత జవాన్లకు తీవ్ర గాయాలు కాలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు.

''డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో చైనా దళాలు ఆక్రమించుకుని యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని మన సైనికులు నిర్ణీత పద్ధతిలో ఎదుర్కొన్నారు. చైనా ఆర్మీ మన భూభాగంలోకి చొరబడకుండా మన దళాలు ధైర్యంగా ఆపివేసి, వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి'' అని రాజ్‌నాథ్‌ చెప్పారు. ''ఈ ఘర్షణలో రెండు వైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. మన సైనికులు ఎవరూ చనిపోలేదని లేదా తీవ్రమైన గాయాలు కాలేదని నేను ఈ సభకు చెప్పాలనుకుంటున్నాను. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం కారణంగా, పీఎల్‌ఏ సైనికులు వారి స్వంత స్థానాలకు వెనుదిరిగారు.'' అని తెపారు.

''ఈ సభ మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని, పరాక్రమాన్ని, నిబద్ధతను గౌరవిస్తుందని నాకు నమ్మకం ఉంది" అని రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల మధ్య 30 నెలలకు పైగా సరిహద్దు ప్రతిష్టంభన మధ్య గత శుక్రవారం సున్నితమైన సెక్టార్‌లోని ఎల్‌ఏసీ వెంట యాంగ్ట్సే సమీపంలో ఘర్షణ జరిగింది. భారత్‌ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి చైనా బలగాలను పెంచుకోవడం, సైనిక మౌలిక సదుపాయాలను నిర్మించడం కొనసాగిస్తున్నట్లు యుఎస్ పెంటగాన్ పేర్కొంది. రక్షణ శాఖ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ ఒక బ్రీఫింగ్‌లో ప్రసంగిస్తూ.. భారతదేశం-చైనా సరిహద్దులో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న పరిణామాలను రక్షణశాఖ నిశితంగా గమనిస్తూనే ఉందని అన్నారు.

Next Story