ప్రముఖ చరిత్రకారుడు, రచయిత బాబాసాహెబ్ పురందరే ఇక లేరు. సోమవారం ఉదయం ఆయన మరణించారు. గత శనివారం నాడు బాబా సాహెబ్ బాత్‌రూమ్‌లో జారిపడడంతో దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 5.07 నిమిషాలకు కన్నుమూశారు. రాజా శిశ్‌ఛత్రపతి, దౌలత్, నౌబత్, షెలార్క్‌హింద్ వంటి అనేక నవలలను బాబా సాహెబ్ పురందరే శారు. ఛత్రపతి శివాజీ కాలం నుంచి రాజు, అతని పాలన, కోటలపై పుస్తకాలు రచించారు. బాబా సాహెబ్ జనతా రాజ్ నాటకంతో ప్రసిద్ధి చెందారు. రాజా శివ్‌ఛత్రపతి నవల 16 ఎడిషన్లు పబ్లిష్ కాగా 5 లక్షలకుపైగా ప్రతులు అమ్ముడుపోయాయి. బాబా సాహెబ్ పురందరే సేవలకుగాను మహారాష్ట్ర ప్రభుత్వం 2015లో 'మహారాష్ట్ర భూషణ్' అవార్డుతో సత్కరించింది. 2019లో భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను బాబా సాహెబ్ అందుకున్నారు.
బాబాసాహెబ్ పురందరే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు మాటలకు అందని బాధను కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. పురందరే మరణం చరిత్ర, సాంస్కృతిక ప్రపంచంలో అతి పెద్ద శూన్యతను మిగిల్చిందన్నారు. భవిష్యత్ తరాలు శివాజీ మహారాజ్‌తో మరింత కనెక్ట్ అయ్యేలా చేసినందుకు పురందరేకు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా పురందరే మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో బాసాహెబ్ పురందరేకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.