విచారణకు రాలేనని చెప్పిన ఎమ్మెల్సీ కవిత
లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26న తమ ముందు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ 41ఏ నోటీసు ఇచ్చింది.
By Medi Samrat Published on 25 Feb 2024 6:45 PM ISTలిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26న తమ ముందు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ 41ఏ నోటీసు ఇచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు.
ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని అన్నారు. 41ఏ నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. గతంలో సెక్షన్ 160 ద్వారా నోటీసు ఇచ్చారని.. గత నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధమని తేల్చేశారు కవిత. సెక్షన్ 41ఏ ద్వారా ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోంది.. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని అన్నారు కవిత. నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానని అన్నారు. కానీ 15 నెలల విరామం తరువాత ఇప్పుడు పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని తెలిపారు.