ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష.. రూ. లక్ష జరిమానా.. ఎందుకంటే..
MLA Somnath Bharti Sentenced To 2 Years In Jail For Assaulting AIIMS Staff. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్
By Medi Samrat Published on 23 Jan 2021 3:43 PM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో సోమనాథ్ భారతి ఢిల్లీలోని ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో కోర్టు ఈ తీర్పు చెప్పింది. అయితే.. తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా కోర్టు ఆయనకు బెయిలు కూడా మంజూరు చేసింది.
వివరాళ్లోకెళితే.. 2016 సెప్టెంబరు 9న సోమనాథ్ భారతి, మరో 300 మంది కలిసి ఎయిమ్స్ ప్రహరీకి ఉన్న ఫెన్సింగును జేసీబీ సాయంతో తొలగించారు. ఈ క్రమంలో అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసినట్టు ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ఎస్ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన కోర్టు.. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు గాను సోమనాథ్ భారతిని దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే.. సోమనాథ్ భారతికి ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ఇదిలావుంటే.. కోర్టు తీర్పుపై ఆప్ స్పందించింది. తీర్పుపై సోమనాథ్ భారతి అప్పీలు చేశారని, అప్పిలేట్ స్థాయిలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని పేర్కొంది. న్యాయవ్యవస్థను తాము గౌరవిస్తామని, దానిపై పూర్తి విశ్వాసం ఉందని ఆప్ తెలిపింది. అయితే, కేసు విషయంలో అన్యాయం జరిగిందని.. సోమనాథ్ చాలా గొప్ప నేత అని, నియోజకవర్గంలో ఆయనను అందరూ గౌరవిస్తారని పేర్కొంది. ప్రజల కోసం ఆయన 24 గంటలూ పనిచేస్తారని తెలిపింది. సోమనాథ్‌కు శిక్ష పడిన విషయం తెలిసి నియోజకవర్గ ప్రజలు విచారంలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.