మిస్ సౌత్ ఇండియా అన్సీ కబీర్, మాజీ మిస్ కేరళ రన్నరప్ అంజనా షాజన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అక్టోబర్ 31 అర్ధరాత్రి కేరళలోని కొచ్చి దగ్గర ఈ ఇద్దరూ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు కూడా మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరగక కొన్ని నిమిషాల ముందు ఇంస్టాగ్రామ్ లో అన్సి ఇట్స్ టైం టు గో అంటూ ఓపోస్ట్ పెట్టారు. ఈ ఏడాది మిస్ సౌత్ ఇండియా గా అన్సీ కబీర్ సెలెక్ట్ గా కాగా 2019లో మిస్ కేరళ గా రన్నరప్ గా అంజనా షాజన్ నిలిచింది.
అన్సీ కబీర్ వయసు 25 సంవత్సరాలు. అన్సీ తిరువనంతపురం జిల్లాలోని అలంకోడ్కు చెందిన యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో వైటిళ్ల-పలరివట్టం మధ్య జాతీయ రహదారిపై హాలిడే ఇన్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొని చెట్టును ఢీకొట్టింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అన్సీ, అంజన కాకుండా, త్రిసూర్ కు చెందిన అబ్దుల్ రెహమాన్, ముహమ్మద్ ఆసిఫ్ కూడా కారులో ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఎర్నాకులం మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేర్పించారు.