భారత సైన్యం అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు
Ministry of Defense has provided new weapons to the Indian Army. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ రెడీ అవుతోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న
By అంజి
సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ రెడీ అవుతోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాతో సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే జల, వాయు మార్గాల్లో నిఘా వ్యవస్థను కేంద్ర రక్షణ శాఖ మరింత బలోపేతం చేస్తోంది. చైనాకు చెక్ పెట్టేందుకు సైన్యానికి భారత ప్రభుత్వం సరికొత్త అస్త్రాలను అందించింది. పాంగాంగ్ సరస్సులో ఏ మూలకైనా నిమిషాల్లో చేరుకునేలా తయారు చేసిన బోటుతో సహా మరికొన్ని ఆయుధాలను ఇవాళ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి అందజేశారు.
పాంగాంగ్ సరస్సుపై పట్టు సాధించేందుకు సరికొత్త టెక్నాలజీతో తయారు చేసిన బోట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బోట్‌లను భారత సైన్యానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధికారికంగా అందించారు. ఈ బోటులో ఒకేసారి 35 మంది సైనికులను సరస్సులోని ఏ ప్రాంతానికైనా చాలా తక్కువ టైమ్‌లో చేర్చవచ్చు. దీంతో సరిహద్దుల్లో భారత సైనిక శక్తి మరింత పెరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ బోట్‌లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు.
అలాగే బార్డర్‌లో శత్రు దేశాల కదిలికలను నిశితంగా పసిగట్టేందుకు.. దేశీయంగా తయారు చేసిన డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇది కూడా భారత సైన్యం అమ్ముల పొదిలో చేరింది. ఈ నిఘా డ్రోన్ సరిహద్దుల్లో సూక్ష్మమైన కదలికలను కూడా పసిగట్టగలుగుతుంది. ఈ డ్రోన్ వ్యవస్థ సాయంతో సరిహద్దులో భారత్ బలం మరింత పెరగనుందని ఆర్మీ అధికారులు తెలిపారు. అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైనికులకు F-INSAS వ్యవస్థకు సంబంధించిన AK-203 అసాల్ట్ రైఫిల్స్ను అందజేశారు.