మన జీవితంలో డిజిటల్ మనీ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న దుకాణదారుల నుండి పెద్ద రిటైల్ దుకాణాల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఇటీవల డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తున్నారు. బీహార్‌కు చెందిన రాజు పటేల్ అనే బిచ్చగాడు కూడా తన భిక్షాటనలో టెక్నాలజీని వాడుకున్నాడు. అతను తన మెడలో ఈ-వాలెట్, క్యూఆర్ కోడ్‌ను ట్యాగ్ వేసుకుని డిజిటల్ చెల్లింపులు అంగీకరిస్తూ అడుక్కోవడం ప్రారంభించాడు. రాజు పటేల్ ఎత్తుగడకు సంతోషించిన స్థానిక ప్రజలు అతన్ని భారతదేశపు మొదటి డిజిటల్ బిచ్చగాడుగా ముద్ర వేశారు.
దీనిని చూసి ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రతి మూలకు డిజిటలైజేషన్ చేరుకుందని కొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే.. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో ప్రభుత్వాల వైఫల్యం అని కొంతమంది వ్యాఖ్యానించారు. ప్రజల అభిప్రాయాలను పక్కన పెడితే.. రాజు పటేల్ తన ప్రాంతంలో ఒక ప్రముఖుడిగా మారారు. రాజు పటేల్ ప్రయత్నం డిజిటల్ చెల్లింపులను ఉపయోగించడానికి సాధారణ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.