ఆదివారం లక్నోలో జరిగిన సమావేశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి తన వారసుడిగా పార్టీ జాతీయ సమన్వయకర్త ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి చేసిన ఈ ప్రకటనతో యూపీ రాజకీయాల్లో మరోసారి కలకలం మొదలైంది. ఆకాష్ ఆనంద్ ఎవరు అనే చర్చ జోరందుకుంది.
ఆకాష్ ఆనంద్ బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కుమారుడు. ఆకాష్ లండన్‌లోని ఓ పెద్ద కాలేజీలో ఎంబీఏ పట్టా పొందాడు. ఆకాష్ గత కొన్నేళ్లుగా పార్టీలో చురుగ్గా ఉన్నారు. యువతకు కనెక్ట్ అయ్యేలా ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను ఆకాష్ తీసుకున్నారు.
మాయావతి వారసుడు ఆకాష్ ఆనంద్ రాజకీయ ప్రవేశం ఆకస్మికంగా జరగలేదు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఎస్పీ అధినేత్రి ఆయనను ప్రజల ముందుంచారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆకాష్‌ను చేర్చారు. అదే సమయంలో ఎస్పీతో బీఎస్పీ పొత్తు తెగిపోవడంతో ఆకాష్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు.
ఆ తరువాత 2022 సంవత్సరంలో జరిగిన హిలాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం BSP స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేశారు. ఇందులో మాయావతి తర్వాత ఆకాష్ పేరు రెండవ స్థానంలో ఉంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసే బాధ్యతను కూడా ఆయనకు అప్పగించారు. ఇప్పుడు ఆయనను తన వారసుడిగా మాయావతి ప్రకటించారు.
అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మాయావతి పార్టీ బాధ్యతలు చేపడుతుండగా.. ఇతర రాష్ట్రాల్లో ఆకాష్ ఆనంద్ పార్టీని నడిపించనున్నారు.