అగ్గిపెట్టె ధరలు త్వరలో పెరగనున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు 1 రూపాయి ఉన్న అగ్గిపెట్టెను రూ.2లకు అమ్మనున్నారు. అగ్గిపుల్లల తయారీకి వినియోగించే ముడి పదార్థాలు ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తయారీ సంస్థలు తెలిపాయి. అగ్గిపెట్టె తయారీదారులకు సంబంధించిన ఐదు సంఘాలు శివకాశీలో సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాయి. అగ్గిపులల తయారీలో 14 రకాల ముడి పదార్థాలు వాడుతారు. మైనం ధర రూ.58 నుంచి రూ.80కి, రెడ్ ఫాస్పరస్ ధర రూ.425 నుంచి రూ.810కి పెరిగిందని, అలాగే పేపర్, బాక్స్ బోర్డులు, పొటాషియం క్లోరేట్, గంధకం ధరలు పెరిగాయని అగ్గిపెట్టె తయారీ సంస్థలు చెప్పాయి. మరోవైపు ఇంధన ధరల వల్ల ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు తీవ్ర భారమయ్యాయి అని అంటున్నారు.
దాదాపు 14 సంవత్సరాల తర్వాత అగ్గిపెట్టె ధరను పెంచుతూ తయారీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గతంలో 50 పైసలుగా ఉన్న అగ్గిపెట్ట ధరను రూ.1కి పెంచుతూ 2007 లో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇప్పుడు అగ్గిపెట్టె ధరను రూ.2కు పెంచారు. తయారీదార్లు 600 అగ్గిపెట్టెల బాక్సును విక్రయదారులకు రూ.270 నుంచి 300కి ఇస్తుండగా, ఇక నుండి రూ.430 నుంచి 480కి పెంచాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని నేషనల్ స్మాల్ మ్యాచ్‌బాక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ కార్యదర్శి వి.ఎస్.సేతురథినమ్ తెలిపారు. దీంతో పాటు జీఎస్‌టీ, ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు కూడా వర్తిస్తాయి. ఒక్క తమిళనాడులోనే 4 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా అగ్గిపెట్టె తయారీ ఫ్యాక్టరీలపై ఆధారపడి బతుకుతున్నాయి.