పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందడంతో మంటలను ఆర్పడానికి ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈలోగా ఆసుపత్రి సిబ్బంది రోగులను ఖాళీ చేయించారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటనా స్థలం నుండి వెలువడిన ఫోటోలు చూస్తే.. ఆసుపత్రి నుండి ఖాళీ చేయించిన రోగులు బయట నేలపై పరుపులపై పడుకోవడం చూడవచ్చు.
అగ్నిమాపక అధికారి లవ్‌ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. మంటలు అదుపులో ఉన్నాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పాడు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న పంజాబ్ మంత్రి హర్భజన్ సింగ్.. ఈ విషయంపై విచారణ జరుపుతామని చెప్పారు.
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందిస్తూ.. "అమృత్‌సర్‌లోని గురునానక్ ఆసుపత్రిలో దురదృష్టకర అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మంత్రి హర్భజన్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నేను సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు.