ఛతీస్‌గఢ్- ఒడిశా బార్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో జనవరి 19 రాత్రి నుంచి పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 14కి చేరిందని పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టుల ఏరివేత టార్గెట్‌గా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 12 మంది డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే భారీస్థాయిలో వెపన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ జయరామ్, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ఉన్నట్లు సమాచారం. చలపతిపై ప్రభుత్వం గతంలో రూ.కోటి రివార్డు ప్రకటించింది.