మేజర్ అయిన యువ‌తి అంగీకారంతో పెళ్ళైన పురుషుడు సహజీవనం చేయొచ్చు..!

నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

By -  Medi Samrat
Published on : 27 March 2026 5:10 PM IST

మేజర్ అయిన యువ‌తి అంగీకారంతో పెళ్ళైన పురుషుడు సహజీవనం చేయొచ్చు..!

నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహితుడైన పురుషుడు, మేజర్ అయిన మహిళతో ఆమె అంగీకారంతో సహజీవనం చేయడం నేరం కిందకు రాదని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ సహజీవన జంట తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

షాజహాన్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల అనామిక, వివాహితుడైన నేత్రపాల్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. జనవరి 8న అనామిక తల్లి తన కుమార్తెను నేత్రపాల్ ప్రలోభపెట్టి తీసుకెళ్లాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అనామిక, నేత్రపాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు అంగీకారంతో కలిసి జీవించినప్పుడు, అందులో నేరపూరిత కోణం లేదని కోర్టు స్పష్టం చేసింది. మేజర్ అయిన మహిళ తన ఇష్టప్రకారం నేత్రపాల్‌తో జీవిస్తున్నట్లు పోలీసులకు కూడా స్పష్టం చేసిందని తెలిపింది. అయితే ఈ జంట భద్రతకు స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని ఆదేశించింది. వారి ఇంటికి వెళ్లడం గానీ, ఫోన్ లేదా ఇతర మార్గాల ద్వారా సంప్రదించడం గానీ చేయవద్దని యువతి కుటుంబ సభ్యులను హెచ్చరించింది.

Next Story