ఆగస్టు 6న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా ను ప్రకటించారు. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, టిఎంసి, లెఫ్ట్ ఫ్రంట్ సభ్యులు, ఆర్‌జెడి, ఎస్‌పి, ఇతరులతో సహా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పాల్గొని.. సమావేశం నిర్వహించిన తర్వాత ఆమె పేరు ఖరారు చేయబడింది.
మార్గరెట్ అల్వా గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. ఆమె గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, యువజన మరియు క్రీడలు, మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలలో కేంద్ర సహాయ మంత్రిగా (MoS) పనిచేశారు. గవర్నర్‌గా నియమించబడక ముందు, అల్వా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా ఉన్నారు. ఆమె నాలుగు పర్యాయాలు (1974, 1980, 1986 మరియు 1992) రాజ్యసభలో ఉన్నారు. 1999లో ఆమె ఉత్తర కన్నడ నియోజకవర్గం నుండి 13వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమె పలు కీలక పదవులు చేపట్టారు. ఆమె అత్తగారు వైలెట్ అల్వా 1960లలో రాజ్యసభ స్పీకర్‌గా ఉన్నారు.