దుబాయ్ పోలీసులు, అస్సాం పోలీసుల సమన్వయంతో దివంగత ఫుట్‌బాల్ క్రీడాకారుడు డిగో మారడోనాకు చెందిన దొంగిలించబడిన లగ్జరీ వాచ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. వాజిద్ హుస్సేన్ అనే నిందితుడిని అస్సాంలో అరెస్టు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు డియెగో మారడోనాకు చెందిన హెరిటేజ్ హుబ్లాట్ వాచ్‌ను స్వాధీనం చేసుకునేందుకు.. అస్సాం పోలీసులు, ఇండియన్ ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ద్వారా దుబాయ్ పోలీసులతో సమన్వయం దర్యాప్తు చేపట్టారని తెలిపారు.
హిమంత బిస్వా శర్మ ట్విటర్‌లో ఇలా వ్రాశారు.. "అంతర్జాతీయ సహకారంతో దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు దివంగత డియెగో మారడోనాకు చెందిన హెరిటేజ్ హుబ్లాట్ వాచ్‌ను తిరిగి పొందడానికి అస్సాం పోలీసులు దుబాయ్ పోలీసులతో సమన్వయం చేసుకున్నారు. వాజిద్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. చట్టబద్ధమైన చర్య తీసుకోబడుతోంది." కేంద్ర ఏజెన్సీ ద్వారా దుబాయ్ పోలీసుల నుండి ఇన్‌పుట్ అందుకున్న అస్సాం పోలీసులు నిందితుడిని శివసాగర్‌లోని అతని నివాసం నుండి శనివారం తెల్లవారుజామున 4 గంటలకు అరెస్టు చేసినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ తెలిపారు.
దుబాయ్‌లో దివంగత ఫుట్‌బాల్ ప్లేయర్ వస్తువులను భద్రపరిచే కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పనిచేసినప్పుడు మారడోనా సంతకం చేసిన పరిమిత ఎడిషన్ హబ్లాట్ వాచ్‌ను నిందితుడు దొంగిలించాడని ఆరోపించారు. ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్టులో అస్సాంకు పారిపోయినట్లు తెలుస్తోంది. శివసాగర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ రౌషన్ మాట్లాడుతూ.. "రహస్య సమాచారం ఆధారంగా, మేము గత రాత్రి ఆపరేషన్ ప్రారంభించాము. అతని అత్తమామల ఇంటి నుండి వ్యక్తిని పట్టుకున్నాము. మేము అతని నుండి హెరిటేజ్ హబ్లాట్ వాచ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాము. మా విచారణ కొనసాగుతోంది." అన్నారు.