ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో విద్యార్థిని సహా ఐదుగురిని మావోయిస్టులు ఎత్తుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సుక్మా జిల్లాలోని కొన్టా పీఎస్ పరిధిలో బటెర్ విలేజ్‌పై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఐదుగురు గ్రామస్తులను మావోయిస్టులు బలవంతంగా తమ వెంట తీసుకుపోయారు. మావోయిస్టులు తీసుకెళ్లిన ఐదుగురిలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉంది. అయితే వారిని ఎందుకు తీసుకెళ్లారన్న విషయం ఇంకా తెలియలేదని సుక్మా ఎస్పీ సునీల్ శర్మ వెల్లడించారు. అపహరణకు గురైన వారి కోసం పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు.
భద్రతా దళాలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు. తరచుగా సమావేశాల కోసం గ్రామస్తులను మావోయిస్టులు తీసుకెళ్తుంటారని చెప్పారు. అపహరణకు గురైన వారిని విడుదల చేయాలని బస్తర్ రీజియన్‌లోని గిరిజన సంఘాలు గొడుగు సంస్థ సర్వ ఆదివాసీ సమాజ్ మాయిస్టులను కోరాయని తెలిపారు. ఈ ఏడాది జులైలో కూడా కుందేడ్‌కు చెందిన 8 మందిని ఎత్తుకెళ్లారని, మూడు రోజుల తర్వాత వారిని విడుదల చేశారని సునీల్ శర్మ తెలిపారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్టా పోలీస్‌స్టేషన్‌కు 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న బటెర్ గ్రామంలో జరిగింది.