ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
By Medi Samrat Published on 28 Dec 2024 8:22 AM
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. వేలాది మంది జనం ఆయన అంత్యక్రియల వాహనాన్ని వెంబడించి నిగమ్ బోద్ ఘాట్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా 92 ఏళ్ల మన్మోహన్ సింగ్‌ను ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి 9.51 గంటలకు తుది శ్వాస విడిచారు.
అంత్యక్రియలకు ముందు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ కార్యాలయానికి తరలించగా.. ఆయన సతీమణి గురుశరణ్ కౌర్, ఆమె కుమార్తె దమన్ సింగ్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తుది నివాళులర్పించారు. ఎంపీ పి చిదంబరం, మనీష్ తివారీ, పలువురు పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహంతో అంతిమ యాత్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమయ్యింది.