మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్

Manmohan Singh diagnosed with dengue. భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు డెంగ్యూ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయిందని

By Medi Samrat  Published on  16 Oct 2021 1:31 PM GMT
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు డెంగ్యూ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయిందని ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి అధికారులు తెలిపారు. కొన్నేండ్లుగా ఆయనకు వ్యక్తిగత వైద్యుడిగా ఉన్న డాక్టర్‌ నితీష్ నాయక్ మార్గదర్శకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండడమే కాకుండా.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపారు. అంతేకాకుండా ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతోందని మెడికల్‌ బులిటెన్‌లో తెలిపారు.

89 ఏండ్ల మన్మోహన్‌ సింగ్‌ జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో బుధవారం చేరారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆయనకు వైరస్‌ సోకగా ఎయిమ్స్‌లో చేరారు. గత ఏడాది మే నెలలో ఛాతిలో ఇబ్బంది రావడంలో ఆయనను ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. పలువురు నేతలు ఎయిమ్స్‌ను సందర్శించి మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు జూలోని జంతువులేమీ కాదని, తన తండ్రి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంపై ఆమె తప్పుపట్టారు. మన్మోహన్ సింగ్ ను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మన్మోహన్‌ సింగ్‌ సతీమణి గురుశరన్‌ కౌర్‌ను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను మాండవీయ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు.

'మన్మోహన్‌సింగ్‌ ఎయిమ్స్‌లో డెంగ్యూ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నది. కేంద్ర ఆరోగ్య మంత్రి వచ్చి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే, పరామర్శిస్తున్న సమయంలో ఫొటోలను తీసుకోవడంపై అమ్మ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ వినిపించుకోకుండా ఫొటోలు తీసుకున్నారు. దీనిపై అమ్మ చాలా బాధపడింది. వాళ్లేమీ జూలో జంతువులు కాదు కదా? కొంచెమైనా నైతికత, వైద్య నిబంధనలు పాటించాలి కదా?' అని మన్మోహన్‌ సింగ్‌ కుమార్తె డామన్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. కేంద్ర మంత్రి మాండవియా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలను తొలగించారు.


Next Story