ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ : నేడు సీబీఐ ముందుకు సిసోడియా.. జైల్ ట్వీట్‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో మ‌నీశ్ సిసోడియా నేడు సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రు కానున్న నేప‌థ్యంలో ఆయ‌న చేసిన ట్వీట్ వైర‌ల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2023 11:26 AM IST
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ : నేడు సీబీఐ ముందుకు సిసోడియా.. జైల్ ట్వీట్‌

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాను నేడు(ఆదివారం) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధికారులు ప్ర‌శ్నించ‌నున్నారు. గ‌త వార‌మే ఆయ‌న సీబీఐ ముందు హాజ‌రు కావాల్సి ఉంది. అయితే.. తాను బ‌డ్జెట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాన‌ని, కొంత స‌మ‌యం కావాల‌ని అధికారుల‌ను కోరారు. దీంతో ఆదివారం విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు.

ఈ నేప‌థ్యంలో సిసోడియా సోష‌ల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. "నేను ఈ రోజు సీబీఐ విచార‌ణ‌కు మ‌రోసారి హాజ‌రు అవుతాను. విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తా. లక్షలాది చిన్నారుల ప్రేమ, కోట్లాది భారతీయుల ఆశీర్వాదం నాకు ఉంది. మ‌రికొన్ని నెల‌లు జైలులో ఉండాల్సి వ‌చ్చినా లెక్క చేయ‌ను. నేను భ‌గ‌త్ సింగ్‌ను అనుస‌రించే వ్య‌క్తిని" అంటూ మనీశ్ సిసోడియా రాసుకొచ్చారు.

’దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మనీష్‌. లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దీవెనలు నీపై ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లాల్సి రావడం శాపం కాదు.. గౌరవం. నువ్వు జైలు నుంచి త్వరగా తిరిగి రావాలని నేను దేవుడిని ప్రార్థిస్తా‘ అంటూ సీబీఐ విచారణకు వెళుతున్న సిసోడియాను ఉద్దేశించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

కాగా.. సిసోడియాను సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న నేప‌థ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పలువురు ఆప్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Next Story