ఐఐటీ-బొంబాయిలోకి అక్రమంగా ప్రవేశించినందుకు కర్ణాటకలోని మంగళూరు నివాసిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కళాశాల యాజమాన్యం అతనిపై ఫిర్యాదు చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బిలాల్ తేలి అనే యువకుడు ఐఐటీ బొంబాయిలో ఒక కార్యక్రమం కోసం వచ్చి అతడు బయటకు వెళ్లలేదని తెలుస్తోంది. బిలాల్ మొదట్లో ఒక రోజు నిర్వహించిన కార్యక్రమం కోసం క్యాంపస్‌లోకి ప్రవేశించి, ఆపై క్యాంపస్‌లోనే ఉండి, క్లాసులకు హాజరు కావడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.
బిలాల్ దగ్గర సరైన అడ్మిషన్ లేదా పత్రాలు లేవని, అతను ఐఐటీ-బొంబాయిలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నాడని, పలు తరగతులకు హాజరవుతున్నాడని తేలింది. ఒక ప్రొఫెసర్ ఐడెంటిటీ కార్డు చూపించమని అడిగినప్పుడు దొరికిపోయాడు. వెంటనే ఇన్స్టిట్యూట్ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. జూన్ 2-7 మధ్య అతను క్యాంపస్‌లో కనిపించాడని, ఆ తర్వాత కొంతకాలం కనిపించకుండా పోయాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 17న మళ్లీ ఆ ప్రాంగణంలో కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. అతన్ని అరెస్టు చేసి పోలీసు కస్టడీలో ఉంచారు. అతని వద్ద ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదు. ఇప్పటివరకు అతని నుండి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకోలేదని పోలీసులు తెలిపారు. అతనికి క్యాంపస్ లో ఎవరైనా సహచరులు ఉన్నారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.