మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రాణాలకు ముప్పు ఉందని ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం ఓ ఆగంతుకుడి నుంచి బెదిరింపులు రావడంతో ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఠాణెలోని సీఎం వక్తిగత నివాసంతో పాటు ముంబైలోని అధికారిక నివాసం వర్షకు భద్రతను మరింత పెంచారు. షిండే అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో తన తొలి ర్యాలీలో పాల్గొననున్నారు. దీనికి కొద్ది రోజుల ముందు బెదిరింపులు రావడంతో నిఘా వర్గాలు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశాయి. మరోవైపు ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని సీఎం షిండే అన్నారు. హోంశాఖ, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.
బెదిరింపులు జరిపిన వ్యక్తిని పట్టుకోడానికి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. తాజాగా సీఎంను బెదిరించిన వ్యక్తిని పోలీసుల అరెస్ట్ చేశారని, ప్రస్తుతం పోలీసులు సీఎం సెక్యూరిటీపై ఫుల్ ఫోకస్ పెట్టారని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. 'సీఎంను హత్య చేసేందుకు వ్యూహం సిద్ధమైందంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ విషయంలో పోలీసులు ఫుల్ అలెర్ట్‌గా ఉన్నారు' అని ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఫడ్నవీస్ ఎటువంటి వివరాలను షేర్ చేయలేదు.