ఆనందంతో కేకలు వేశాను : ట్విన్ టవర్స్ కూల్చివేత బటన్‌ నొక్కిన ఇంజ‌నీర్‌..!

Man who pressed button that brought down twin towers. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నిబంధనలు పాటించకుండా నిర్మించిన

By Medi Samrat  Published on  28 Aug 2022 8:30 PM IST
ఆనందంతో కేకలు వేశాను : ట్విన్ టవర్స్ కూల్చివేత బటన్‌ నొక్కిన ఇంజ‌నీర్‌..!

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నిబంధనలు పాటించకుండా నిర్మించిన సూపర్ టెక్ ట్విన్ టవర్స్ అపెక్స్, సియాన్ నేలమట్టం అయ్యాయి. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులు ఈ టవర్స్ ను కూల్చివేశారు. అందుకోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. 100 మీటర్ల దూరం నుంచి బటన్ నొక్కగా కేవలం 9 సెకన్ల వ్యవధిలోనే ఈ ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. ప్రైమరీ బ్లాస్ట్ కు 7 సెకన్ల సమయం పట్టగా, సెకండరీ బ్లాస్ట్ 2 సెకన్ల సమయం తీసుకుంది. ఈ భారీ టవర్స్ ను కూల్చివేసేందుకు అధికారులు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. శిథిలాల తొలగింపునకు మరో రూ.13.5 కోట్లు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు.

2009లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్ ను రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన నిర్మించింది. మూడేళ్లలో ఈ టవర్స్ నిర్మించారు. ఈ జంట టవర్స్ లోని అపెక్స్ టవర్ ఎత్తు 102 మీటర్లు కాగా, ఇందులో 32 అంతస్తులు ఉన్నాయి. సియాన్ టవర్స్ ఎత్తు 95 మీటర్లు. ఈ రెండు టవర్లలో 915 ఫ్లాట్లు, 21 షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించి ఈ టవర్స్ కట్టారంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, టవర్స్ ను కూల్చేయాలంటూ గతేడాది తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్విన్ టవర్స్ ను కూల్చివేశారు.

3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి భారీ టవర్లను కూల్చివేయడానికి బటన్‌ను నొక్కిన వ్యక్తి ఎడిఫైస్ ఇంజనీరింగ్ అధికారి చేతన్ దత్తా అని తెలిసింది. ఈ కూల్చివేత 100% విజయవంతమైందని విలేకరులతో అన్నారు. కూల్చివేత తర్వాత, తాను పేలుడుకు బాధ్యత వహించిన మరో నలుగురు అధికారులతో కలిసి స్థలానికి వెళ్లామని అన్నారు. ఈ ఘటన తర్వాత తమకు పూర్తిగా ఉపశమనం కలిగిందని.. ఆనందంతో కేకలు వేయడం ప్రారంభించానని దత్తా తెలిపారు.

"కూల్చివేత 100% విజయవంతమైంది. మొత్తం భవనం కూల్చివేయడానికి 9-10 సెకన్లు పట్టింది. నా బృందంలో 10 మంది, 7 మంది విదేశీ నిపుణులు, ఎడిఫైస్ ఇంజినీరింగ్‌కు చెందిన 20-25 మంది ఉన్నారు" అని దత్తా చెప్పినట్లు వార్తా సంస్థ ANI తెలిపింది. కూల్చివేతకు హెచ్చరిక సైరన్ మోగించిన తర్వాత తాను, తన బృందం లోని సభ్యులు ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదని దత్తా చెప్పారు. "బటన్ నొక్కిన వెంటనే క్రిందికి వస్తున్న జంట నిర్మాణాలను పరిశీలించడానికి నేను నా తలను పైకి లేపాను. అంతా నేలమట్టమైనప్పుడు, మేము సమీపంలోని ఎమరాల్డ్ కోర్ట్, ATS విలేజ్ హౌసింగ్ సొసైటీలను తనిఖీ చేయడానికి అక్కడికి చేరుకున్నాము," అన్నారాయన.


Next Story