29 ఏళ్లు పాకిస్థాన్‌లో జైలు జీవితం.. ఎన్ని చిత్రహింసలు పెట్టారో క‌ళ్ల‌కుక‌ట్టిన‌ట్లు చెప్పాడు

Man returns to India after serving 29 years in Pakistani jail, shares harrowing ordeal. పాకిస్థాన్ జైలులో 29 ఏళ్లు గడిపిన తర్వాత ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వచ్చిన

By Medi Samrat  Published on  27 Dec 2021 1:51 PM GMT
29 ఏళ్లు పాకిస్థాన్‌లో జైలు జీవితం.. ఎన్ని చిత్రహింసలు పెట్టారో క‌ళ్ల‌కుక‌ట్టిన‌ట్లు చెప్పాడు

పాకిస్థాన్ జైలులో 29 ఏళ్లు గడిపిన తర్వాత ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వచ్చిన ఓ భారతీయుడు జమ్మూ కాశ్మీర్‌లోని కతువాలోని తన స్వగ్రామంలో ఘనస్వాగతం అందుకున్నాడు. కుల్దీప్ సింగ్ పాక్ జైలులో గ‌డిపిన‌ బాధాకరమైన అనుభవాల‌ను ప్ర‌ముఖ‌వార్తా సంస్థ‌తో పంచుకున్నాడు. ఎటువంటి నేరం చేయని భారతీయులను అక్కడ ఎలా హింసిస్తున్నారో తెలిపాడు. పాక్ ఆర్మీ వలలో చిక్కిన ప్రతి భారతీయుడిని గూఢచారిగా పరిగణిస్తున్నారని.. చిత్రహింసలకు గురిచేస్తున్నారని.. కఠిన కారాగార శిక్షలు విధించారని, మానవత్వం చూపడం లేదని అన్నారు. మూడున్నరేళ్లుగా నన్ను చిత్రహింసలకు గురిచేశారని, అమానవీయంగా వ్యవహరించారని తెలిపాడు.

జమ్మూ కాశ్మీర్‌ కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటికీ పాకిస్తాన్ జైలులో విడుదల కోసం ఎదురుచూస్తున్నారని.. అయితే 10 నుండి 12 మంది భారతీయులు పాకిస్తాన్‌లోని మానసిక ఆసుపత్రిలో భద్రతా సంస్థలచే తీవ్రంగా హింసించబడినందున చికిత్స పొందుతున్నారని పేర్కొన్నాడు. "పాకిస్థాన్ నుండి నన్ను విడిపించడానికి నా కుటుంబం ప్రతి తలుపు తట్టింది. నేను క్షేమంగా తిరిగి వచ్చినందుకు చాలా అదృష్టవంతుడిని.. కాకపోతే పాకిస్తాన్‌లో జైలులో ఉన్న కొందరు వ్యక్తులు తమ కుటుంబాలతో తిరిగి కలవలేదు అని అన్నాడు.

కతువాలోని బిల్లావర్‌లోని మక్వాల్ గ్రామానికి చెందిన సింగ్(53) 1992 డిసెంబర్ 17-18 తేదీల్లో జమ్మూ సరిహద్దు నుంచి పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్థాన్‌కు చేరుకుని పాక్ సైన్యంచే అరెస్టు చేయబడ్డాడు. పాక్ కోర్టులో గూఢచర్యం కేసులో నాలుగు విచారణలను ఎదుర్కొని.. లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభ‌వించాడు. పాకిస్తాన్‌లో అరెస్టు అయిన తర్వాత.. జైలు నుండి తమకు లేఖ రాసినప్పుడే అతని ఆచూకీ తెలిసిందని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. ఔరంగాబాద్‌కు చెందిన మహ్మద్ గుఫ్రాన్‌తో పాటు సింగ్ ను సోమవారం పాకిస్తాన్ విడుదల చేసింది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారు పంజాబ్‌లోని గురునానక్ దేవ్ హాస్పిటల్‌లోని రెడ్‌క్రాస్ భవన్‌కు చేరుకున్నారు.


Next Story