13వేల జీతం.. 21 కోట్లు కొల్లగొట్టాడు
మహారాష్ట్రలోని ప్రభుత్వ రంగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రూ.13,000 జీతం కోసం పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ 21 కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు.
By Medi Samrat Published on 26 Dec 2024 3:38 PM ISTమహారాష్ట్రలోని ప్రభుత్వ రంగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రూ.13,000 జీతం కోసం పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ 21 కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. ప్రియురాలి కోసం లగ్జరీ కార్లు, 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. ఛత్రపతి శంభాజీనగర్‌లోని డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాంట్రాక్టు సిబ్బంది అయిన హర్షల్ కుమార్ క్షీరసాగర్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. హర్షల్‌కు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై అతని సహోద్యోగి యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
23 ఏళ్ల యువకుడు డబ్బును స్వాహా చేసేందుకు అనుసరించిన పక్కా ప్లాన్ దర్యాప్తులో బయట పడింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాంకు ఖాతాకు లింక్ చేసిన ఇమెయిల్ అడ్రస్‌లో మార్పు చేయడానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని పాత లెటర్‌హెడ్‌ను హర్షల్ ఉపయోగించాడు. అతను స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖాతాకు సమానమైన చిరునామాతో కొత్త ఇమెయిల్ ఖాతాను తెరిచాడు. ఒక్క అక్షరం మాత్రమే తేడా పెట్టాడు. ఈ ఇమెయిల్ చిరునామా ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేశారు. ఇక హర్షల్ కు OTPలు, లావాదేవీలకు అవసరమైన ఇతర సమాచారాన్ని ఈ ఈమెయిల్ ద్వారా యాక్సెస్ చేశాడు.
ఆ తర్వాత డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కమిటీ బ్యాంక్ ఖాతాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని హర్షల్ యాక్టివేట్ చేశాడు. ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబర్ 7 మధ్య కాలంలో 13 బ్యాంకు ఖాతాల్లోకి రూ.21.6 కోట్లు బదిలీ చేశాడు. ఈ డబ్బుతో రూ.1.2 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు, రూ.1.3 కోట్ల విలువైన ఎస్‌యూవీ, రూ.32 లక్షల విలువైన బీఎండబ్ల్యూ బైక్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. హర్షల్ తన ప్రియురాలికి ఛత్రపతి శంభాజీనగర్ విమానాశ్రయం సమీపంలో ఖరీదైన 4 బిహెచ్‌కె ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ కోసం వజ్రాలు పొదిగిన ఒక జత గాజులను కూడా ఆర్డర్ చేశాడు.
ఈ భారీ మోసంలో మరికొంత మంది ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు, డబ్బును స్వాహా చేసేందుకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నారు. ఆర్థిక అవకతవకలను క్రీడా శాఖ అధికారి గమనించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.