గ్వాలియర్‌లో ఓ వ్యక్తి వీధికుక్కను కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీధికుక్క చేసిన పొరపాటు ఏమిటంటే, అది ఆ మనిషి పెంపుడు కుక్కను చూడడానికి రోజూ వస్తుండడమే..! ఈ నెల 5వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డులో అతడు కట్టెతో వీధి కుక్క మీద విరుచుకుపడ్డాడు. కింద పడిపోయిన వీధి కుక్క తలపై రాయితో బాది చంపేశాడు. ఈ సంఘటన హజీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్ షహర్ స్క్వేర్ ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది.
ఆ వ్యక్తి కనికరం లేకుండా వీధికుక్కను కర్రతో కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉంది. కుక్క తలపై రాయి విసిరాడు. సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నగరంలోని జంతు ప్రేమికులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుడిని బంతి బాయిస్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు వర్గాల ప్రకారం.. తన పెంపుడు కుక్కను వీధికుక్క తరచుగా సందర్శించడంపై బంతి బాయిస్ ఆగ్రహం చెందాడు. బుధవారం ఆ వీధికుక్క మరో మూడు వీధికుక్కలతో కలిసి అతడి ఇంటికి చేరుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు కర్ర తీసి కుక్కపై దాడి చేశాడు. కింద పడిపోయిన ఆ వీధి కుక్కను చంపేదాకా అతడి కోపం శాంతించలేదు.