శరద్ పవార్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన‌ వ్య‌క్తి అరెస్ట్‌

Man held from Pune for issuing death threat to Nationalist Congress Party chief Sharad Pawar. నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ కు ఇటీవల హత్య బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat  Published on  12 Jun 2023 2:45 PM IST
శరద్ పవార్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన‌ వ్య‌క్తి అరెస్ట్‌

నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ కు ఇటీవల హత్య బెదిరింపులు వచ్చాయి. ఎన్సీపీ చీఫ్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులపై ఆయన కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ చర్యకు పాల్పడింది పూణెకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 14వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శరద్ పవార్‌ ను చంపేస్తామంటూ రెండు రోజుల క్రితం బెదిరింపులు వచ్చాయి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్‌కు పట్టిన గతే శరద్ పవార్‌కూ పడుతుందని హెచ్చరించాడు. 2013లో నరేంద్ర దభోల్కర్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపినట్టే.. పవార్ ను కూడా చంపుతారని పోస్ట్ చేశారు. బెదిరింపుల ఘటనపై స్పందించిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని 32 ఏళ్ల సాగర్ బార్వేగా గుర్తించిన పోలీసులు ఆదివారం ఎస్ప్లానేడ్ కోర్టులో హాజరుపరిచారు. అతడికి జూన్ 14 వరకు పోలీసు కస్టడీ విధించారు. శరద్ పవార్‌పై బార్వే ఫేస్‌బుక్‌లో బెదిరింపు పోస్ట్‌లు చేశారు.

నర్మదాబాయి పట్వర్ధన్ అనే హ్యాండిల్ నుండి బార్వే పోస్ట్ చేసారు. 2013లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నరేంద్ర దభోల్కర్‌ ను చంపారు. అలాంటిదే శరద్ పవార్ కు జరగబోతోందని ఫేస్‌బుక్ పోస్ట్ లో చెప్పారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది, అయితే ప్రాథమిక విచారణలో బార్వేకు ఏ పార్టీతో సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్‌లో బెదిరింపులకు సంబంధించి ఎన్‌సీపీ కార్యకర్త శుక్రవారం లోక్‌మాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు.


Next Story