మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా నౌధా గ్రామానికి చెందిన కమలేష్ కుష్వాహా సీఎం హెల్ప్‌లైన్‌పై ప్రత్యేక ఫిర్యాదు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక్క లడ్డూ మాత్రమే ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు స్వీకరించిన అనంతరం విధివిధానాల ప్రకారం పంచాయతీ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయితీ సెక్రటరీ దండ తీసుకుని లడ్డూలు తినిపించడానికి కమలేష్ ఇంటికి వెళ్లాడు. అప్పటికీ లడ్డూలు తీసుకోకపోగా.. ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు నిరాకరించాడు కమలేష్.
ఆగస్టు 15న పంచాయతీ కార్యాలయంలో జరిగిన జెండా ఆవిష్కరణ సందర్భంగా చిన్నారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒక్కొక్కరికి ఒక్కో లడ్డూ ఇచ్చారు. రెండు లడ్డూలు కావాలని కమలేష్ అడగగా.. పంచాయతీ కార్మికుడు నిరాకరించాడు. కమలేష్ దీన్ని అవమానంగా భావించాడు. దీంతో సీఎం హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు
ఫిర్యాదు అనంతరం పంచాయతీ కార్యదర్శి రవీంద్ర శ్రీవాస్తవ మార్కెట్‌లో కిలో లడ్డూలు, దండ కొని కమలేష్ ఇంటికి వెళ్లారు. లడ్డూలు తీసుకోకపోగా.. ఆ రోజు అందరి ముందు తనకు లడ్డూలు ఎందుకు ఇవ్వలేదని కమలేష్ మొండిగా ఉన్నాడని శ్రీవాస్తవ చెప్పాడు. ఇలాంటి ఫిర్యాదులు చేయడం కమలేష్‌కు అలవాటు అని స్థానికులు చెబుతున్నారు.