Video : చితి నుంచి లేచిన శ‌వం.. ముగ్గురు వైద్యులు సస్పెండ్.. ఏం జ‌రిగిందంటే.?

రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on  22 Nov 2024 4:19 PM IST
Video : చితి నుంచి లేచిన శ‌వం.. ముగ్గురు వైద్యులు సస్పెండ్.. ఏం జ‌రిగిందంటే.?

రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వైద్యులు చనిపోయినట్లు ప్రకటించిన 25 ఏళ్ల వ్యక్తి, దహన సంస్కారానికి కొన్ని క్షణాల ముందు స్పృహలోకి వచ్చాడు, ఆ తర్వాత శ్మశానవాటికలో కోలాహలం నెలకొంది. కుటుంబం లేని రోహితాష్ కుమార్ అనే చెవిటి, మూగ వ్యక్తిని తిరిగి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. అతను షెల్టర్ హోమ్‌లో నివసిస్తున్నాడు. రోహితాష్ కుమార్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ.. జైపూర్‌కు రిఫర్ చేయబడ్డాడు. అయితే మార్గమధ్యంలో అతను మరణించినట్లు ప్రకటించారు.

ఝుంఝును జిల్లా కలెక్టర్ రామావతార్ మీనా వైద్యుల నిర్లక్ష్యంపై దృష్టి సారించారు.. ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేశారు. ఈ కేసులో డాక్టర్ యోగేష్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, పీఎంవో డాక్టర్ సందీప్ పచార్‌లను సస్పెండ్ చేశారు. దీనిపై విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేశామని, వైద్యశాఖ కార్యదర్శికి సమాచారం అందించామని మీనా తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం షెల్టర్ హోమ్‌లో స్పృహతప్పి పడిపోయిన కుమార్‌ను జుంజునులోని BDK ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేర్చారు. అయితే.. మధ్యాహ్నం 2 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి మృతదేహాన్ని రెండు గంటలపాటు మార్చురీలో ఉంచారు.

పోలీసులు పంచనామా సిద్ధం చేసి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. అయితే మృతదేహాన్ని చితిపై ఉంచిన వెంటనే కుమార్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని లేచి నిలబడ్డాడు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి మళ్లీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇంతలో రెవెన్యూ అధికారి మహేంద్ర ముండ్, సామాజిక న్యాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పవన్ పూనియా కూడా ఆసుపత్రికి చేరుకున్నారు.


Next Story