బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసాన్ని పేల్చివేస్తానని బెదిరింపులకు పాల్పడిన 28 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్, గుజరాత్ పోలీసుల సంయుక్త బృందం బుధవారం అరెస్టు చేసింది. అంకిత్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి ఈ బెదిరింపు కాల్ చేశాడని, ఈ కాల్ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకునేందుకు అతడిని విచారిస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని లస్కానాలో నిందితుడిని అరెస్టు చేసినట్లు పాట్నా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రాజీవ్ మిశ్రా తెలిపారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఫోన్ కాల్ పై మార్చి 20న పాట్నాలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మిశ్రాను సూరత్‌లో గుర్తించారు. బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన మిశ్రాను ట్రాన్సిట్ రిమాండ్ కోసం సూరత్ కోర్టులో హాజరుపరిచి, ఆపై బీహార్‌కు తీసుకెళ్లనున్నారు. 2018లో నితీష్ కుమార్‌ను చంపుతానని బెదిరించినందుకు ప్రమోద్ కుమార్ అనే వ్యక్తిని పాట్నాలో అరెస్టు చేశారు.