మహమ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్ లో కూడా అలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. జూన్ 11, శనివారం హౌరాలోని పంచ్లా బజార్‌లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హింస వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పారు.
ట్విటర్‌లో సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. "నేను ఇంతకుముందు కూడా చెప్పాను... గత రెండు రోజులుగా, హింసాత్మక సంఘటనల కారణంగా హౌరాలో సాధారణ ప్రజల జీవితాలు ప్రభావితమయ్యాయి, దీని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని సహించబోము, కఠిన చర్యలు తీసుకుంటాము. బీజేపీ పాపాలు చేస్తుంటే ప్రజలు బాధపడాలా?" అని ఆమె ప్రశ్నించారు.
బెంగాల్ లో రెండో రోజూ అల్లర్లు జరిగాయి. హౌరా జిల్లాలో కొందరు నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేశారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పాంచ్లా బజార్ లో పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. జూన్ 15 దాకా నిషేధాజ్ఞలను అమలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. విద్వేషానికి ప్రజలంతా ఏకం కావాలని పశ్చిమబెంగాల్ పోలీసులు పిలుపునిచ్చారు. ప్రజలెవరూ అల్లర్లలో భాగం కారాదని, రెచ్చగొట్టే చర్యలకు పూనుకోకూడదని విజ్ఞప్తి చేశారు. అల్లర్లు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు.