పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొవిడ్‌పై బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత మహమ్మారి పరిస్థితిని సమీక్షించి.. ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నందున కోల్‌కతాలో కంటైన్‌మెంట్ జోన్‌లను గుర్తించడం ప్రారంభించాలని అధికారులను కోరారు. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలను కొంతకాలం మూసివేయవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తెలిపారు. దాదాపు 20 నెలల విరామం తర్వాత నవంబర్ 16న రాష్ట్రంలో విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యాయి.
మంగళవారం ఒకే రోజు 752 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన 752 కేసుల్లో కోల్‌కతాలో 382, ఉత్తర 24 పరగణాల్లో 102 ఉన్నాయి. సోమవారం కోల్‌కతాలో 204 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య బులెటిన్ డేటా వెల్లడించింది. బెంగాల్‌లో కోవిడ్-19 మొత్తం కేసుల సంఖ్య 16,31,817 ఉండగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 7,457గా ఉంది. దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అత్యధికంగా ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో బెంగాల్ కూడా ఒకటి. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. పశ్చిమబెంగాల్‌లో ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యాయి. వారిలో ఇప్పటివరకు ఒక రోగి మాత్రమే కోలుకున్నారు. డిసెంబర్ ప్రారంభంలో మమత నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ -19కి సంబంధించిన ఆంక్షలను జనవరి 15వరకు పొడిగించింది. అక్కడ మొదటి ఓమిక్రాన్ కేసు ఏడేళ్ల బాలుడిలో నిర్ధారించబడింది.