బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వలసదారులపై 'వేధింపులు'.. వర్షంలో సీఎం మార్చ్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.

By Medi Samrat
Published on : 16 July 2025 5:09 PM IST

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వలసదారులపై వేధింపులు.. వర్షంలో సీఎం మార్చ్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ భారీ పాదయాత్ర ( ఊరేగింపు)కి ముఖ్యమంత్రి నాయకత్వం వహించారు. కోల్‌కతాలోని కాలేజ్ స్క్వేర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ఓ ప‌క్క వ‌ర్షం ప‌డుతున్నా ధర్మతలలోని డోరినా క్రాసింగ్ వరకు సాగింది. ఇందులో టిఎంసి ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీతో సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగిన‌ ఈ పాదయాత్రకు ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులను మోహరించి పలు రహదారులపై ట్రాఫిక్‌ను మళ్లించారు.

నిరసన ప్రదర్శనలో సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాలీల పట్ల భాజపా అనుసరిస్తున్న వైఖరి చూసి నేను సిగ్గుపడుతున్నానని, నిరాశకు గురయ్యానని అన్నారు. ఇక నుంచి బెంగాలీలో ఎక్కువగా మాట్లాడాలని నిర్ణయించుకున్నానని, వీలైతే నన్ను నిర్బంధ శిబిరాల్లో ఉంచాలని సీఎం అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించిందని, ఇప్పుడు బీహార్‌లోనూ అదే పద్ధతి అవలంబిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ నుండి దాదాపు 22 లక్షల మంది వలస కూలీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని ఆమె చెప్పారు. వారి వద్ద చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులన్నీ ఉన్నాయి. అయినప్పటికీ వారిని అనుమానంతో చూస్తున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. బెంగాలీ మాట్లాడే వలసదారులు రోహింగ్యా ముస్లింలు అని నిరూపించాలని నేను సవాలు చేస్తున్నాను.. ఇది బెంగాలీల పరువు తీసేందుకు జరిగిన కుట్ర మాత్రమేన‌న్నారు. బెంగాల్ ప్రజలపై ఇలాంటి వైఖరిని సహించేది లేదని, ప్రతి వేదికపై టీఎంసీ దీనికి వ్యతిరేకంగా గళం విప్పుతుందని చెప్పారు.

కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇదే అంశంపై టీఎంసీ నిరసనలు చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రంలో పర్యటించనున్న తరుణంలో ఈ ప్రదర్శన జరుగుతోంది. అలాగే, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రదర్శన రాజకీయంగా కీలకంగా పరిగణించబడుతుంది. ఈ విషయంలో బెంగాలీ మాట్లాడే వారిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ వేధిస్తున్నారని టీఎంసీ పేర్కొంది. ఒడిశాలో బెంగాలీ కూలీలను అరెస్టు చేయడం, ఢిల్లీలో బహిష్కరణ కార్యక్రమం, అస్సాంలోని కూచ్ బెహార్‌లో రైతును విదేశీయులుగా ముద్ర వేయడంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story