సొంత సోదరుడితో వైరానికి సిద్ధమైన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సోదరుడితో బంధుత్వాన్ని తెంచుకుంటున్నట్లు తెలిపారు.
By Medi Samrat Published on 13 March 2024 3:45 PM ISTపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సోదరుడితో బంధుత్వాన్ని తెంచుకుంటున్నట్లు తెలిపారు. హౌరా లోక్‌సభ స్థానం నుంచి ప్రసూన్ బెనర్జీని పోటీకి దింపాలన్న తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయాన్ని మమతా బెనర్జీ సోదరుడు స్వపన్ బెనర్జీ వ్యతిరేకించారు. అతడి వ్యాఖ్యల కారణంగా అతడితో సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. వయసు పెరిగే కొద్దీ అత్యాశ కూడా పెరుగుతోంది.. మా కుటుంబంలో మొత్తం 32 మంది ఉన్నారని ఆమె అన్నారు. ఇకపై స్వపన్ ను తన కుటుంబంలో సభ్యుడిగా పరిగణించనన్నారు. ప్రసూన్ బెనర్జీ అర్జున అవార్డు గ్రహీత.. అతను మా పార్టీ నామినేట్ చేసిన అభ్యర్థని మమతా బెనర్జీ వివరించారు.
ప్రస్తుతం తన బంధువుల చికిత్స కోసం ఢిల్లీలో ఉన్న స్వపన్ బెనర్జీ ఇండియా టుడేతో ఫోన్‌లో మాట్లాడారు. హౌరా లోక్‌సభ స్థానానికి తృణమూల్ కాంగ్రెస్ సమర్థులైన వారికి టికెట్ ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. హౌరా లోక్‌సభ స్థానం నుండి అభ్యర్థి ఎంపిక పట్ల నేనైతే సంతోషంగా లేను.. ప్రసూన్ బెనర్జీ సరైన ఎంపిక కాదు. చాలా మంది సమర్థులైన అభ్యర్థులను పట్టించుకోలేదని స్వపన్ బెనర్జీ అన్నారు. ఇక స్వపన్ బెనర్జీ బీజేపీలో చేరతారనే ఊహాగానాలను కూడా కొట్టిపారేశారు. తన సోదరికి మద్దతు ఇస్తానని.. బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలన్నీ నిరాధారమని అన్నారు.
మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, ప్రసూన్ బెనర్జీ హౌరా స్థానం నుండి రెండుసార్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఆయా స్థానాల నుంచి బరిలోకి దిగిన 42 మంది తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆయన కూడా ఉన్నారు.