'రాజీనామా చేయండి'.. పాక్ బెదిరింపులపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
By - Medi Samrat |
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కోల్‌కతాపై దాడి చేస్తామని పాకిస్థాన్ ఇటీవల చేసిన హెచ్చరికను ప్రస్తావిస్తూ.. ఇంతటి తీవ్రమైన విషయంపై ప్రధానమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార సభల్లో బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రధానమంత్రి, జాతీయ భద్రతకు సంబంధించిన ఈ సున్నితమైన విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మమతా అన్నారు.
మీరు ఎన్నికల సమయంలో బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుంటారు, కానీ పాకిస్తాన్ బెంగాల్‌పై దాడి గురించి మాట్లాడినప్పుడు, మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల్లో, మీరు మీ పదవికి రాజీనామా చేయాలి." ఆదివారం కూచ్ బెహార్‌లో ప్రధానమంత్రి ర్యాలీని ప్రస్తావిస్తూ.. మమతా బెనర్జీ అక్కడ ఉన్న ముప్పు గురించి ఆయన ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి తన ర్యాలీలో ఎందుకు చెప్పలేదు? దేశానికి ఎదురయ్యే ఏ సవాలునూ మనం మౌనంగా సహించనట్లే, కోల్‌కతా లేదా బెంగాల్‌కు ఎదురయ్యే ఏ ముప్పునూ మౌనంగా సహించబోము" అని అన్నారు.
భారతదేశం ఏదైనా 'దుస్సాహసం' చేస్తే కోల్‌కతా వరకు దాడి చేసే సామర్థ్యం ఇస్లామాబాద్‌కు ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్న తర్వాత ఈ వివాదం మొదలైందన్నది గమనార్హం. సియాల్‌కోట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో భారతదేశం చేపట్టే ఏ సైనిక చర్యకైనా కోల్‌కతాపై దాడితోనే సమాధానం ఉంటుందని ఆసిఫ్ హెచ్చరించారు.
మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వ దౌత్యం, స్పందనపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు, ఈ బెదిరింపులను జాతీయ భద్రతా సమస్యగా అభివర్ణించారు. బెంగాల్ ప్రజలు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని, రాబోయే ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వ 'ఉదాసీనత'కు ప్రతిస్పందిస్తారని ఆమె స్పష్టం చేశారు.