నేడు ఏపీలో భారీగా అధికారుల బదిలీ జరగగా.. బీహార్‌లో కూడా పెద్ద ఎత్తున పరిపాలనా పునర్వ్యవస్థీకరణ జరిగింది. 34 మంది ఐఏఎస్‌లు, 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీహార్‌లో రామనవమి సందర్భంగా అల్లర్లు జరిగిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున పరిపాలనా పునర్వ్యవస్థీకరణ జరగడం చర్చనీయాంశంగానే ఉంది. రామ నవమి తర్వాత.. బీహార్‌లోని ససారం, బీహార్ షరీఫ్‌లలో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఇందులో చాలా మంది ప్రజలు ఆస్తులను నష్టపోయారు.
బీహార్ షరీఫ్, ససారంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. బీహార్‌ను 17 సంవత్సరాలుగా పాలిస్తున్న నితీష్ పై ఎన్నడూ లేనంతగా వ్యతిరేకత వచ్చింది. నేరం, అవినీతి, మతతత్వ వాదం వంటి విషయాలలో రాజీ పడలేమని నితీష్ ప్రభుత్వం ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. రామ నవమి రోజున శాంతిభద్రతలు దెబ్బతినడంతో సాధారణ ప్రజలతో సహా ప్రతిపక్షాలు సైతం నితీష్ పాలనపై విరుచుకుపడుతున్నారు. అల్లర్లు జరిగిన బీహార్ షరీఫ్ ప్రాంతం నలందలో ఉంది. నలంద నితీష్ కుమార్ సొంత జిల్లా కావడంతో ప్రభుత్వంపై ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో కూడా 39 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది