పార్లమెంట్ సమావేశాలు నేడు ఆరో రోజుకు చేరుకున్నాయి. లోక్‌సభలో అధికార పార్టీ, విపక్షాల మధ్య పలు అంశాలపై వాడివేడి చర్చ జరగడంతో సభ కాస్త సందడిగా సాగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ మహువా మోయిత్రా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
“గౌరవనీయులైన ప్రధాని సార్.. మీరు ఇక్కడ ఒక గంట ఉన్నారు కాబట్టి.. నా మాట కూడా వినాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. చివరిసారి నేను ఇక్కడ (పార్లమెంట్) నిలబడి మాట్లాడాలనుకుంటే అనుమతించలేదు. ఒక ఎంపీ గొంతును అణచివేసినందుకు అధికార పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. నన్ను సభలో కూర్చోబెట్టడానికి ప్రజలు మిమ్మల్నీ ఓడించారు. మీ 63 మంది ఎంపీలను శాశ్వతంగా వాళ్ల ఇళ్లకు పంపారు. ఒక ఎంపీ గొంతును అణిచివేసినందుకు అధికార పార్టీ బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది. దేశ ప్రజలు బీజేపీని 303 నుంచి 240 సీట్లకు తగ్గించారని అన్నారు. బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్న కారణంగా వారి ప్రభుత్వం స్థిరంగా లేదని.. మిత్రపక్షాలపై ఆధారపడటం వల్ల ఏ రోజునైనా కూలిపోవచ్చని మొయిత్రా ఈరోజు నొక్కి చెప్పారు.
"క్యాష్ ఫర్ క్వెరీ" కుంభకోణంలో చిక్కుకున్న మొయిత్రా డిసెంబర్ 2023లో లోక్ సభ నుండి బహిష్కరణకు గురయ్యారు. మోదీ ప్రభుత్వాన్ని సవాలు చేసే లక్ష్యంతో పార్లమెంట్‌లో నిర్దిష్టమైన ప్రశ్నలు అడిగినందుకు బదులుగా వ్యాపారవేత్త నుండి బహుమతులు, నగదును స్వీకరించారని ఎథిక్స్ కమిటీ ఆమెను దోషిగా నిర్ధారించింది. ఇది పార్లమెంటరీ ప్రత్యేక హక్కులు, ప్రవర్తనకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడటంతో బహిష్కరణ వేటు పడింది.