మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం రద్దు

క్యాష్ ఫర్ క్వెరీ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయబడింది.

By Medi Samrat  Published on  8 Dec 2023 12:41 PM GMT
మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం రద్దు

క్యాష్ ఫర్ క్వెరీ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయబడింది. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ నివేదికపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరగగా.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ పటేల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. ప్రతిపాదనను ఆమోదించిన అనంత‌రం.. మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయబడింది.

ఖరీదైన బహుమతుల కోసం పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందానీ తరపున పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని మహువా మోయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఇది మాత్రమే కాదు.. నేరుగా ప్రశ్నలు అడిగేలా హీరానందానీకి తన పార్లమెంటరీ లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌ను వెల్లడించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

మహువా మోయిత్రా కేసులో ఎథిక్స్ కమిటీ సిఫార్సుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ విషయంలో ప్రభుత్వం త్వరప‌డుతుంద‌ని ఆరోపించారు.

దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి 2005 నాటి క్యాష్ ఫర్ క్వెరీ కేసును ప్రస్తావిస్తూ.. అప్పుడు 10 మంది ఎంపీలను తమ వైపు కూడా వినకుండా బహిష్కరించారని అన్నారు.

ఎథిక్స్ కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కూడా మహువా మోయిత్రా తన అభిప్రాయాలను వెల్లడించడానికి అవకాశం ఇవ్వాలని అన్నారు.

Next Story