దేశ రక్షణలో భాగంగా, భారత సరిహద్దులోని గాల్వాన్ లోయలో ప్రాణాలు వొదిలిన తెలంగాణ బిడ్డ, కల్నల్ సంతోష్ బాబును కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారంతో గౌరవించింది. ఆయన మరణాంతనం కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర అవార్డును ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో అవార్డులో ప్రదానోత్సం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా కల్నల్ సంతోష్ బాబు సతీమణి, తల్లి ఈ మహావీర్ చక్ర పురస్కారాన్ని స్వీకరించారు. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే జవాన్లకు ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం మహావీర్ చక్ర.
2020 జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరోచితంగా పోరాడిన సంతోష్ బాబు ప్రాణాలు కోల్పోయారు. కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట. సంతోష్ బాబు 1982లో జన్మించారు. సంతోష్ బాబుకు భార్య మంజుల, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. 16 బిహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా సంతోష్ బాబు వ్యహరించారు. గల్వాన్ లోయ వద్ద చైనా తన బలగాలతో దురాక్రమణ ప్రయత్నించింది. భారత సైనికులు కూడా అంతే రీతిలో వారిని తిప్పికొట్టారు.
దీంతో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో సంతోష్ బాబుతో పాటు 21 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఇటీవల సంతోష్ బాబు సేవలను స్మరిస్తూ మహావీర్ చక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సంతోష్‌బాబుతో విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన పలువురు సైనికులకు, వీరమరణం పొందిన అమరుల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ గ్యాలంటెరీ పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు ముఖ్యులు హాజరయ్యారు.